Apr 29, 2017
116 Views
0 0

ఓ శ్రామికుడా.. హక్కులు తెలుసుకో..!

Written by

సంఘటిత, నిర్మాణ రంగంలో పని చేస్తున్న శ్రామికులు జీవన సమరంలో ప్రతిఏట పరాజితులుగానే మిగులుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో వారికి అవగాహన లేకపోవడమేనని చెప్పవచ్చు. ఈ కారణంగా హక్కులు, సంక్షేమ పథకాలు సుమారు 70శాతం వరకు కార్మికుల దరి చేరడం లేదు. ప్రతిఏటా వచ్చినట్లుగానే మళ్లీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పరుగెత్తుకొస్తోంది. ఇక నుంచైనా ప్రభుత్వ పరంగా భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల వెల్ఫేర్ బోర్డు, తెలంగాణ లేబర్ వెల్ఫేర్ బోర్డు, కార్మిక శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై అవగాహన కోసం ఈ కథనం

అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు…
* నిర్మాణ రంగ కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.6లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. శాశ్వత అంగవైకల్యం పొందితే సదరు కార్మికుడికి రూ.5లక్షలను, పాక్షిక అంగవైకల్యం పొందితే రూ.4లక్షల ఆర్థిక సాయం అందిస్తారు.
* గుర్తింపు పొందిన కార్మికుడు సాధారణ పరిస్థితులలో మరణిస్తే అతని కుటుంబానికి రూ.60,000 ఆర్థిక సాయం అందుతుంది.
* ఏదేని అనారోగ్య సమస్యతో మరణించినా అతడి దహన సంస్కారాలను నిర్వహించేందుకు గాను అతని కుటుంబ సభ్యులకు రూ.20,000 ఆర్థిక సాయంను అందిస్తారు.
* అనారోగ్యం కారణంగా ఏదేని దవాఖానలో చికిత్స పొందుతూ మరణించిన నిర్మాణ రంగ కార్మికుడి మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ చార్జీల కింద ప్రతి కిలోమీటర్‌కు రూ.20చొప్పున అందిస్తారు.
* మహిళా కార్మికురాలి ఆడ బిడ్డల పెళ్లి ఖర్చులకు గాను నిర్మాణ రంగ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నుంచి రూ.20వేలను అందిస్తారు.
* భవన నిర్మాణ కార్మికులకు, వారి పిల్లలకు కాన్పు సమయంలో రూ.20వేలను అందిస్తారు.
* ఏదేని అనారోగ్య సమస్యతో భవన నిర్మాణ కార్మికులు దవాఖానలో చేరితే వారికి ప్రతి రోజు రూ.200చొప్పున చెల్లింస్తారు. మూడు నెలలకు పైగా ఆసుపత్రిలోనే ఉంటే ప్రతి నెల రూ.3వేలను చెల్లిస్తారు.
* నిర్మాణ రంగ కార్మికుల వెల్ఫేర్ బోర్డు ఆధ్వర్యంలో ఆసక్తి ఉన్న కార్మికులకు కన్‌స్ట్రక్షన్ ట్రైనింగ్ సెంటర్‌లో వృత్తి నైపుణ్యతలో శిక్షణ ఇస్తారు. ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నా కార్మికులు ఈ పథకాలను అందిపుచ్చుకోలేక పోతున్నారు.

కార్మికుల పిల్లల చదువులకు ఉపకార వేతనాలు…
* కార్మికుల పిల్లల ఉన్న చదువులకు ఆర్థిక సాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తెలంగాణ లేబర్ వెల్ఫేర్ బోర్డు ద్వారా కార్మికుల పిల్లలకు గతకొద్ది సంవత్సరాలకు ఉపకార వేతనాలను అందిస్తోంది. ముఖ్యంగా 10వ తరగతి, ఐటీఐ కోర్సులకు రూ.1000, పాలిటెక్నిక్ రూ.1500 కోర్సును అభ్యసిస్తోన్న సమయంలో ప్రతి ఏడాది ఇస్తారు. అలాగే ఇంజినీరింగ్, మెడిసిన్, లా, బీఎస్సీ ఎగ్రికల్చర్, బీఎస్సీ వెటర్నరీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ హార్టీకల్చర్, బీసీఏ, ఎంసీఏ, బి-ఫార్మసీ/ఎం.ఫార్మసీ, బీబీఏ, ఎంబీఏ, డిప్లమా ఇన్ మెడికల్ లాబరేటరీ టెక్నీషియన్, పీజీ డిప్లమా ఇన్ మెడికల్ లాబరేటరీ టెక్నీషియన్‌లతో పాటు దివ్యాంగులైన కార్మికుల పిల్లలకు రూ.2000లను విద్యభ్యాసం చేస్తున్న ప్రతి ఏడాది అందిస్తారు. ప్రధానంగా షాపులలో, ఎస్టాబ్లిష్‌మెంట్ రంగంలో, మోటర్ ట్రాన్స్‌పోర్ట్ యూనిట్స్‌లలో, కో-ఆపరేటీవ్ సొసైటీలలో, వివిద పరిశ్రమలలో పని చేసే కార్మికుల పిల్లలకు వారి ఉత్తీర్ణత శాతం (మెరిట్) ఆధారంగా ఈ ఉపకార వేతనాలను అందిస్తారని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ప్రమాద బీమా పథకాలు…
* ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ప్రమాద భీమా పథకం కింద వారి కుటుంబ సభ్యులకు రూ.5లక్షల ఆర్థిక సాయంను అందిస్తారు. ఈ బీమా డ్రైవర్లకు, నాన్ ట్రాన్స్‌పోర్ట్ అటో డ్రైవర్లకు, హోం గార్డులకు, వర్కింగ్ జర్నలిస్టులకు వర్తిస్తుంది. పైన తెలిపిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలంటే ఆయా కార్మిక సంస్థల నుంచి గుర్తింపును పొందడంతో పాటు ఆయా జిల్లాల కార్మిక శాఖ అధికారి కార్యాలయంలో కార్మికుల పూర్తి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

గుర్తింపు పొందడం సులభం..
* వయసు 18 సంవత్సరాల నుంచి 60సంవత్సరాల మద్యలో ఉండాలి. వీళ్లు జిల్లా కార్మిక శాఖలో గుర్తింపును పొందుటకు మొదటగా రూ.50చెల్లించి వారి వివరాలను నమోదు చేసుకొని గుర్తింపు కార్డు (ఐడెంటిటీ కార్డు)ను పొందాల్సి ఉంటుంది. అనంతరం ఏడాది రూ.12 చొప్పున ఐదు ఏండ్లకు గాను రూ.60 చెల్లించి వారి పేరును గుర్తింపు పొందిన కార్మికుల జాబితాల్లో రిజిస్టర్ చేసుకోవాలి. అలాగే
ప్రతి ఐదేండ్లకోసారి రూ.60 చెల్లించి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కేవలం రూ.110లను చెల్లిస్తే ప్రమాదాల భారిన పడినప్పుడు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదకుంటుంది. అలాగే దుకాణం, పరిశ్రమలు, ప్రైవేటు సంస్థలు, హోటళ్లలో విధులు నిర్వహించే కార్మికులు కేవలం రూ.7 (వర్కర్ రూ.2, యాజమాన్యం రూ.5)లను చెల్లించి జిల్లా కార్మిక శాఖ అధికారి నుంచి గుర్తింపు కార్డును పొందాలి. పూర్తి వివరాలకు ఏ జిల్లా పరిధిలో పని చేస్తున్న కార్మికుల ఆ జిల్లా కార్మిక శాఖ అధికారి కార్యాలయంలో సంప్రదించాలి.

* కార్మికులు విధి నిర్వహణలో ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు మరణించినైట్లెతే వారి కుటుంబానికి రూ.30వేల ఆర్థిక సాయంను అందిస్తారు. గాయపడి అంగవైకల్యం పొందిన కార్మికులకు రూ.20వేలను, సాదారణంగా మరణిస్తే రూ.10వేలను, దహన సంస్కారాలకు రూ.5వేలు అందిస్తారు.మ్యారేజ్ గిఫ్ట్ కింద కార్మికుల ఆడబిడ్డ పెళ్లికి రూ.10వేల ఆర్థిక సాయంను ప్రభుత్వ పరంగా అందజేస్తారు. మహిళా కార్మికులకు కాన్పు సమయంలో రూ.5వేల ఆర్థిక సాయంను అందిస్తారు.

సద్వినియోగం చేసుకోవాలి
కార్మికుల సంక్షేమం కొరకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. చాలా తక్కువ రుసంను చెల్లించి గుర్తింపు కార్డును పొందడం వలన కార్మికులకు, వారి కుటుంబాలకు చాలా ప్రయోజనాలుంటాయి. అయితే ఈ పథకాలపై కొంత మందికి అవగాహన లేని కారణంగా వాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే కార్మికుల సంక్షేమ పథకాలపై ప్రచారం కల్పించేందుకు కార్మిక శాఖ నుంచి కరపత్రాలను పంపిణీ చేస్తున్నాము. అలాగే వివిద సంస్థలలో పని చేస్తున్న కార్మికులకు వారి యాజమాన్యం నుంచి ఏమైన ఇబ్బందులు వస్తే తమను సంప్రదించాలి. సదరు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం.

Article Categories:
Education · News · Telangana

Leave a Reply