Mar 8, 2017
189 Views
0 0

అప్పుడే మహిళలకు సంపూర్ణ స్వాతంత్ర్యం

Written by

మార్చి 8 వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి మహిళల హక్కులు గుర్తొస్తాయి.. మహిళల పట్ల గౌరవ మర్యాదలు జ్ఞప్తికి వస్తాయి. ఏడాదికి ఒకసారి పర్వదినంలా వచ్చే మహిళా దినోత్సవం నిజంగా ఏం చెబుతోంది..? ఏ లక్ష్యాన్ని నిర్దేశిస్తోంది.? భారతీయ మహిళ కోరుకుంటోందేంటి…? అసలు సమాజంలో మహిళ ఎక్కడుంది..?

మహిళ.. కొన్ని యుగాలుగా తన హక్కులకోసం పోరాడుతున్న ఓ సబల. మగాడికి తాను ఏమాత్రం తీసిపోనని నిరూపించుకునేందుకు కొన్ని తరాలుగా పోరాటం చేస్తూనే ఉంది. సమాజంలో తాము సగమనీ.. అవకాశాల్లోనూ తమది సగభామని మహిళాలోకం అడుగుతూనే వస్తోంది.  ఆడదంటే కేవలం పిల్లలు కనే ఒక యంత్రంగా చూసే దుర్మార్గపు వ్యవస్థ నుంచి విముక్తి కోరుకుంది. అనాగరిక కట్టుబాట్ల మధ్య నరకయాతన అనుభవించిన మహిళ… స్వేచ్చా సమానత్వం కోసం నడుం బిగించింది.

1911 మార్చి 8.. ప్రపంచంలో మహిళలకు జరుగుతున్న అన్యాయంపై ఒక్కటైంది వనితా లోకం. సమాన హక్కులకోసం ఆడవాళ్లంతా గొంతెత్తారు. అవకాశాల్లో మేముసైతం అంటూ గర్జించారు. ఇంత గొప్ప మహిళా చైతన్య ఉద్యమం.. శతాబ్దం కిందటే పురుడుపోసుకున్నా…. మహిళా విముక్తిని మాత్రం ఈ ప్రపంచం ఇంకా ఒప్పుకోవడం లేదు. అబలపై అనాగరిక అకృత్యాలు ఇంకా విలయతాండవం చేస్తూనే ఉన్నాయి.

ఇప్పుడు కాలం మారింది. మహిళలు మగాళ్లకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. అన్నిరంగాలూ.. సదా మీ సేవలో అంటూ మహిళలకు దాసోహం అవుతున్నాయి. వృత్తి నిపుణులైన ఆడవారిని అవకాశాలు కోరి వరిస్తున్నాయి. తమను ఎప్పటికప్పుడు అణచేయాలనుకుంటున్న శక్తులపై విశ్రాంతి లేకుండా ఇన్నేళ్ల పాటు సాగించిన పోరాటంలో.. మహిళే విజయం సాధిస్తూ వస్తోంది. ఇది ముమ్మాటికీ తమ ఘనతే అంటోంది నారీ లోకం. చట్టసభల్లో తమ సమాన వాటాను అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉందనేది కొందరు మహిళల వాదన. నిజానికి తమ కోటానూ… తమ అవకాశాలనూ.. ఒత్తిడి కారణంగా ఇవ్వొద్దనీ….. అది తమకు హక్కుగా రావాలని… ఈ మధ్యే మహిళా కాంగ్రెస్ లో నారీ మణులు తేల్చిచెప్పారు.

మహిళా దినోత్సవం అనే మాట గర్వంగా చెప్పుకునే రోజు రావాలంటే.. ప్రభుత్వ విధానాల్లో మార్పురావాలి. పాలకులు చిత్తశుద్దితో పనిచేయాలని ప్రతీ మహిళ కోరుకుంటోంది. మహిళలను కేవలం ఓటర్లుగానే చూడకుండా.. మనలో సగం అన్న భావనతో పాలించాలి. అప్పుడే దేశంలో మహిళలకు సంపూర్ణ స్వాతంత్ర్యం వస్తుంది.

Article Tags:
· ·
Article Categories:
Life Style

Leave a Reply